Article on Evaluation of Examinations Answer Scripts in JNTU-HYD

Boss

Well-Known Member
అడ్డగోలుగా ఇంజనీరింగ్‌ జవాబు పత్రాల ఎవాల్యుయేషన్‌ 6 నిమిషాల్లోనే 30 పేజీలు పూర్తి.. విద్యార్థులకు అన్యాయం 150 పేపర్లు దిద్దాలని జేఎన్‌టీయూ టార్గెట్‌ 15 లక్షల పేపర్లను దిద్దేది 1100 మంది గత ఏడాది దిద్దింది కేవలం 800 మందే రోజుకు వందకుపైగా పేపర్ల మూల్యాంకనం తూతూమంత్రంగా జవాబు పత్రాల పరిశీలన ఎవాల్యుయేటర్లలో అధికులు అర్హత లేనివాళ్లే నష్టపోతున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులు రీవాల్యుయేషన్‌లో పెరుగుతున్న మార్కులు

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో ఒక్కొక్కరు రోజుకు 40 నుంచి 50 పేపర్లను కరెక్షన్‌ చేస్తారు!ఇంటర్మీడియెట్‌ జవాబు పత్రాల మూల్యాంకనంలో ఒక్కొక్కరు రోజుకు 30 నుంచి 40 పేపర్లు దిద్దుతారు!కానీ, ఇంజనీరింగ్‌లో మూల్యాంకనానికి ఒక్కొక్కరికీ రోజుకు జేఎన్‌టీయూ ఇచ్చే టార్గెట్‌... 3బండిల్స్‌! అంటే 150 పేపర్లు! ఇంజనీరింగ్‌ విద్యను పటిష్ఠం చేసే పేరుతో కఠినమైన ప్రశ్నపత్రాలను ఇస్తూ ఇతరత్రా సంస్కరణలు కూడా చేపట్టిన ప్రభుత్వం జవాబు పత్రాల వాల్యుయేషన్‌ విషయంలో మాత్రం మార్పులు తేవడం లేదు. రాష్ట్రంలోని లక్షలాది ఇంజనీరింగ్‌ విద్యార్థులు పరీక్షల్లో రాసే జవాబు పత్రాలను జేఎన్‌టీయూ పరిమిత సంఖ్యలో వాల్యుయేటర్లతోనే దిద్దిస్తోంది. అనుభవం లేని వారిని మూల్యాంకనానికి అనుమతిస్తోంది. వారంతా కలిసి ఆంగ్లంలో రాసిన దాదాపు 30 పేజీల్లోని జవాబు పత్రాన్ని కేవలం ఆరు నిమిషాల్లోనే దిద్ది పారేస్తున్నారు. దాంతో కష్టపడి చదివి పరీక్ష రాసిన విద్యార్థికి ఫలితాల్లో మార్కులు కనిపించడంలేదు. టాప్‌ మార్కులు వస్తాయనుకున్న విద్యార్థి కూడా ఫెయిలవుతున్నాడు. పరీక్షలు కఠినతరంగా ఉంటున్నాయని విద్యార్థులు కష్టపడి చదువుతుంటే, ఎవాల్యుయేటర్లు మాత్రం ఇష్టారాజ్యంగా పేపర్లను దిద్దుతున్నారు. మూల్యాంకనంలో జేఎనటీయూ అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఉదాహరణకు, గత సెమిస్టర్‌కు జేఎన్‌టీయూ పరిధిలో 15 లక్షల పేపర్లను దిద్దారు. దాదాపు 800 మంది ఎవాల్యుయేటర్లు 25 రోజుల్లో మొత్తం పేపర్లను దిద్దేశారు. అంటే ఒక్కొక్కరు రోజుకు సరాసరిన 75 నుంచి 80 పేపర్లు దిద్దినట్లు. అయితే, మొత్తం 800 మంది ఎవాల్యుయేటర్లు అన్ని రోజులూ వాల్యుయేషన్‌కు రారు. ప్రతిరోజూ దాదాపు 150నుంచి 200 మంది వరకూ గైర్హాజరు అవుతూ ఉంటారు. దాంతో ఒక్కొక్కరు రోజుకు సరాసరిన వంద పేపర్లను దిద్దుతారని మూల్యాంకనంలో పాల్గొన్న ఓ ఎవాల్యుయేటర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఎవాల్యుయేటర్లు రోజుకు ఆరు గంటలపాటు మూల్యాంకనం చేస్తారు. అంటే గంటకు ఒక్కో వ్యక్తి సరాసరిన 15 పేపర్లకుపైనే దిద్దిపారేస్తున్నారన్నమాట. అంటే దాదాపు 30 పేజీలున్న జవాబు పత్రాన్ని నాలుగైదు నిమిషాల్లోనే దిద్దేస్తున్నారని ఆయన వివరించారు.

ఈ ఏడాది బీటెక్‌, బీఫార్మసీ కలిపి దాదాపు 3 లక్షలమంది విద్యార్థులు సెమిస్టర్‌ పరీక్షలను రాస్తున్నారు. వీరు రాసే పేపర్లు దాదాపు 15 లక్షల వరకూ ఉంటాయి. కానీ, ఈ ఏడాది మరో 300 మంది వాల్యుయేటర్లను కలిపి మొత్తం 1100 మందితో మూల్యాంకనం చేయిస్తున్నారు. నిజానికి, మూల్యాంకనానికి జేఎన్‌టీయూ 30 నుంచి 40 రోజుల సమయం ఇస్తుంది. కానీ, వాల్యుయేటర్లు 15నుంచి 25 రోజుల్లోనే మూల్యాంకనాన్ని పూర్తి చేసేస్తున్నారు. ఇందుకు జేఎన్‌టీయూ అధికారులు టార్గెట్‌ ఇవ్వడం కూడా కారణమే. రోజుకు 150 పేపర్లు దిద్దాలని లక్ష్యం విధిస్తుండడం తో వాల్యుయేటర్లు కూడా వీలైనంత ఎక్కువ సంఖ్యలో పేపర్లు దిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్కొక్కరు సరాసరి వంద పేపర్లను, కొంతమంది 150 పేప ర్ల టార్గెట్‌ను కూడా దాటేస్తుంటారని వాల్యుయేషన్‌లో పాల్గొన్న అధ్యాపకు డు ఒకరు చెప్పారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే వాల్యుయేటర్ల ఆశ కూడా ఇందుకు కారణమని ఆరోపణలున్నాయి. వాల్యుయేటర్లకు ఒక్కో పేపరుకు రూ.12 రుసుముగా ఇస్తారు. ఒక ప్రొఫెసర్‌ రోజుకు 150 పేపర్లు దిద్దితే అతనికి వచ్చే ఆదాయం రూ.1800. కొంతమంది జవాబు పత్రాల మూల్యాంకనను సంపాదన మార్గంగా ఎంచుకుంటున్నారనే విమర్శలున్నాయి. కొంతమంది ప్రొఫెసర్లయితే అసలు జవాబులు చూడకుండానే నామమాత్రంగా మార్కులు వేస్తున్నారని మూల్యాంకనంలో పాల్గొన్న ఒక ప్రొఫెసరే చెప్పడం గమనార్హం.

అనుభవ లేమే ప్రధాన కారణం
వాస్తవానికి అధ్యాపకునిగా ఐదేళ్ల అనుభవం ఉన్నవారిని మూల్యాంకనం చేసేందుకు తీసుకోవాలి. కానీ, ప్రైవేటు కాలేజీల్లో కూడా ఐదేళ్ల అనుభవం కలిగినవారు పరిమిత సంఖ్యలోనే ఉన్నారు. దీంతో, ప్రైవేటు కాలేజీలు తప్పుడు సమాచారం జతచేసి నూతనంగా చేరిన వారిని, ఏడాది లేదా రెండేళ్ల అనుభవం ఉన్న వారిని మూల్యాంకనకు పంపిస్తున్నారు. వారు వారికి తోచిన విధంగా పేపర్లను మూల్యాంకనం చేస్తున్నారు. ఇక కొందరైతే అసలు టీచింగ్‌ వృత్తిలో లేని వారిని కూడా పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రీ వాల్యుయేషన్‌లో తారుమారు
విద్యార్థులకు మొదటి మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు పునర్‌ మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు అసలు పొంతన ఉండడం లేదు. మొదటి మూల్యాంకనంలో ఒక సబ్జెక్టులో 2, 3, 4 మార్కులు వస్తే... పునర్‌మూల్యాంకనంలో ఆ మార్కులు కాస్తా 30, 40 మార్కులు అవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మొదటి మూల్యాంకనంలో పేపర్‌ను సరిగ్గా కరక్షన చేయకపోవడమే. ఎక్కువ మార్కులు వస్తాయనుకున్న విద్యార్థికి తక్కువ మార్కులు రావడంతో పునర్‌ మూల్యాంకనానికి దరఖాస్తు చేస్తున్నారు. అప్పుడు వాళ్లు ఆశించిన మార్కులు వస్తుండడం గమనార్హం. పునర్‌ మూల్యాంకనానికి తక్కువ మంది అధ్యాపకులు అవసరమవుతుండడంతో అనుభవం ఉన్న వారిని తీసుకుంటున్నారు. వారు మూల్యాంకనాన్ని సరిగ్గా చేస్తుండడంతో విద్యార్థులకు న్యాయం జరుగుతోంది. ఎంతో కష్టపడి చదివినా ఉత్తీర్ణులు కాకపోయేసరికి విద్యార్థులు మానసికంగా దెబ్బతింటున్నారని కొందరు ప్రొఫెసర్లు తెలిపారు. మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు మరిన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, మూల్యాంకనం సరిగ్గా చేయకపోవడంతో తాము పలు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అవుతున్నామని, దీంతో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని వాపోయారు. ఇక, రీ వాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కూ వెయ్యి రూపాయల చొప్పున వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి రావడం ఆర్థిక భారంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల కిందట వచ్చిన సెమిస్టర్‌ ఫలితాల్లో ఫెయిలైన వందల మంది విద్యార్థులు పునర్‌మూల్యాంకనంలో ఉత్తీర్ణులయ్యారు. వీరి ద్వారా కోట్ల రూపాయల ఆదాయం జేఎనటీయూకు సమకూరింది. మూల్యాంకన విధానంలో మార్పు తేవాలని, తమకు అన్యాయం చేయొద్దని విద్యార్థులు కోరుతున్నారు.

Image clips which are published in news paper

Note : Click on the images to view or to download for reading purpose.




Source : Andhra Jyothy News Paper
 
Last edited:
Top